ఇవాళ ఫహద్ ఫాజిల్, నజ్రిమా నజీమ్ దంపతులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నజ్రియా అదివరకే పాపులర్ నటి కాగా, ఫాజిల్ ఇటీవలి కాలంలో మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా తన సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అతడి మలయాళ సినిమాలు తెలుగులో డబ్బయి, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు 'పుష్ప'లో విలన్‌గా నటిస్తూ అల్లు అర్జున్‌ను ఢీకొంటున్నాడు. మరోవైపు నజ్రియా సైతం తొలిసారి ఓ టాలీవుడ్‌లో.. అదీ నాని సరసన నాయికగా 'అంటే సుందరానికి' మూవీలో నటిస్తోంది. ఫహద్, నజ్రియా తొలిసారి కలిసి నటించిన సినిమాలో దంపతులుగా నటించి, ఆ తర్వాత ప్రేమలోపడి నిజ జీవితంలోనూ దంపతులుగా మారారనే విషయం మీకు తెలుసా?
అంజలీ మీనన్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ 'బెంగుళూర్ డేస్'లో ఫహద్, నజ్రియా తొలిసారి కలిసి నటించారు. మలయాళంలోని మోస్ట్ పాపులర్ యాక్టర్స్ పలువురు నటించిన ఆ సినిమాలో నటనకు నజ్రియా బెస్ట్ యాక్ట్రెస్‌గా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకుంది. ఆ మూవీలో ఫహద్, నజ్రియా భార్యాభర్తలుగా నటించారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది.
ఆ సినిమా మరో రెండు నెలల్లో విడుదలవుతుందనంగా, నజ్రియాతో తన నిశ్చితార్ధాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఫహద్! 2014 ఫిబ్రవరిలో వారి నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది ఆగస్ట్ 21న వారు జీవిత భాగస్వాములుగా మారారు. ఇంతకీ ఫహద్ ఎవరో తెలుసా? నాగార్జునతో 'కిల్లర్' మూవీని రూపొందించిన గ్రేట్ మలయాళం డైరెక్టర్స్‌లో ఒకరైన ఫాజిల్ తనయుడు. అతను జాతీయ ఉత్తమనటుడు కూడా. తమ పెళ్లిని పెద్దవాళ్లే అరేంజ్ చేసి, పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎంకరేజ్ చేశారని ఫహద్ తెలిపాడు. ఆ ఇద్దరి పెళ్లికి తానే కారణమని ఒకసారి నిత్యా మీనన్ సరదాగా చెప్పింది. 'బెంగుళూర్ డేస్'లో ఫహద్ భార్య పాత్రకు మొదట తనను అడిగారనీ, కానీ దాన్ని తాను తిరస్కరించడంతో, ఆ ఛాన్స్ నజ్రియాకు వచ్చిందనేది ఆమె చెప్పిన కారణం.
'బెంగుళూర్ డేస్' సెట్స్ మీద ఓ రోజు నజ్రియా తన దగ్గరకు నడుచుకుంటూ వచ్చి "నన్ను పెళ్లిచేసుకుంటావా?" అనడిగిందని ఫహద్ తెలిపాడు. "లైఫ్ అంతా నిన్ను శ్రద్ధగా చూసుకుంటానని ఆమె చెప్పింది. ఏ అమ్మాయీ అలా నాతో అనలేదు." అని ఓ ఇంటర్వ్యూలో అతను చెప్పాడు. అలాంటి అమ్మాయిని ఎవరు మాత్రం ప్రేమించకుండా ఉంటారు! పెళ్లి తర్వాత నాలుగేళ్లు నటన నుంచి బ్రేక్ తీసుకుంది నజ్రియా. ఫహద్ ఇష్టపడకపోవడం వల్లే ఆమె నటనకు దూరమైందంటూ అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది.
2018లో అంజలీ మీనన్ మరో సినిమా 'కూడే'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి, అవన్నీ రూమర్స్ అని తేల్చేసింది నజ్రియా. నిజానికి ఫహద్ తనను పదే పదే స్క్రిప్టులు వినమని అడుగుతూ వచ్చాడని కూడా ఆమె వెల్లడించింది. పెళ్లి తర్వాత ఫహద్ కూడా లాంగ్ బ్రేక్ తీసుకున్నాడని, వైవాహిక జీవితం తొలినాటి మధురిమలను ఆస్వాదించడానికే తాము కొంతకాలం ప్రొఫెషనల్ లైఫ్‌కు దూరంగా ఉన్నామని నజ్రియా స్పష్టం చేసింది.
ఫహద్ సైతం పెళ్లి తన జీవితాన్ని మార్చేసిందనీ, నజ్రియా తనను ప్రశాంతచిత్తునిగా, మరింత నిగర్విగా మార్చిందనీ పలుమార్లు చెప్పాడు. ఇప్పడు ఆ ఇద్దరూ తమ ప్రొఫెషనల్ వర్క్ గురించి షేర్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ ఉంటారట. ఒకరి సమక్షాన్ని మరొకరు ఆస్వాదిస్తూ, హాలిడేస్ లేదా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.